+

5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకిన జేపీ పవర్ షేర్లు.. కారణమిదే..

Authored by భరత్ కలకొండ | The Economic Times Telugu | Updated: 8 Sep 2025, 12:20 pm

జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ (JP Power) షేర్లు ఈరోజు పైపైకి దూసుకెళ్లాయి. 5 శాతం అప్పర్ సర్క్యూట్ ను తాకి రూ. 20 స్థాయికి చేరుకున్నాయి. జేపీ పవర్ పేరెంట్ కంపెనీ జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్(JAL)ను రూ. 17,000 కోట్లకు కొనుగోలు చేసేందుకు వేదాంత లిమిటెడ్ అతిపెద్ద బిడ్డర్ గా నిలిచింది. గతంలో అదానీ గ్రూప్ ఈ కంపెనీని కొనుగోలు చేయనుందని వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పడు వేదాంత రూ. 17 వేల కోట్లు ఆఫర్ చేసి అన్ని కంపెనీలను బీట్ చేసింది. ఈ కారణంగానే జేపీ పవర్ షేర్లు ఈరోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే, జేఎల్ఎల్ కంపెనీల్లో జేపీ పవర్ మాత్రమే లాభాల్లో ఉంది. జేఏఎల్ అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రక్రియను వెళ్లింది. ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు బిడ్లు ఆహ్వానించగా, వేదాంతతో పాటు అదానీ, ఇతర కంపెనీలు కూడా పోటీ పడ్డాయి. కానీ చివరకు వేదాంత టాప్ బిడ్డర్ గా నిలిచింది. అయితే రిజల్యూషన్ ప్లాన్ ఇంకా ఖరారు కాలేదు. కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ (COC) ఆమోదం కోసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

jp power share price hit 5 percent upper circuit after vedanta become top bidder to acquire jal for rs 17000 crore
5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకిన జేపీ పవర్ షేర్లు.. కారణమిదే..

నువామా బ్రోకరేజ్ అంచనా

జేఎఎల్ ను కొనుగోలు చేయడం వల్ల వేదాంత షేర్లపై ప్రభావం పడే అవకాశం ఉందని నువామా బ్రోకరేజ్ అంచనా వేస్తోంది. ఎందుకంటే ఇది వేదాంత ప్రధాన వ్యాపారానికి సంబంధం లేని విభాగం. అయినప్పటికీ వేదాంత స్టాక్ కు బై రేటింగ్ ను కొనసాగిస్తున్నట్లు నువామా తెలిపింది. రిజల్యూషన్ ప్లాన్ ఖరారైన తర్వాత ప్రభావాన్ని అంచనా వేస్తామని తెలిపింది.

వేదంతపై అదనపు భారం

వేదాంత ఈ లావాదేవీని పూర్తి చేయడానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ఆమోదం అవసరం. దీనికి 8 నుంచి 12 నెలల వరకు సమయం పట్టవచ్చు. వేదాంత ముందస్తుగా రూ. 4,000 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. వేదాంత జేఏఎల్ లో ప్రధానంగా విద్యుత్ వ్యాపారంపై దృష్టి సారిస్తుందని, మిగిలిన ఆస్తులను క్రమంగా విక్రయించే అవకాశం ఉందని నువామా అంచనా వేస్తోంది. జేఏఎల్ కొనుగోలు వేదాంతలో మైనారిటీ షేర్ హోల్డర్లకు ప్రతికూలంగా మారవచ్చని పేర్కొంది. ఇప్పటికే వేదాంతకు రుణభారం ఉందని, ఇప్పుడు జేఏఎల్ కొనుగోలు కోసం రూ. 17,000 నిధులను సేకరించాల్సి ఉంటుందని తెలిపింది. ఇది రుణభారాన్ని మరింత పెంచవచ్చని పేర్కొంది. అయితే ఆస్తుల అమ్మకం ద్వారా కొంత ఉపశమనం లభిస్తుందని నువామా తెలిపింది.

జేఏఎల్ ఆస్తులు

జేఏఎల్ ఆస్తులలో ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 4,000 ఎకరాల భూమి, 2,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (జేపీ పవర్‌లో జేఏఎల్‌కు 24 శాతంవాటా ఉంది), 10 ఎంటీపీఏ సిమెంట్ ప్లాంట్, 0.72 ఎంటీపీఏ యూరియా ప్లాంట్, ఐదు హోటళ్లు, ఈపీసీ వ్యాపారాలు ఉన్నాయి. వేదాంత తన ప్రస్తుత వ్యాపారాలతో సమన్వయం ఉన్నందున పవర్ ప్లాంట్‌ను నిలుపుకోవచ్చని, మిగిలిన ఆస్తులను మధ్యకాలంలో విక్రయించవచ్చని నువామా తెలిపింది. ఈ బిడ్ షరతులు లేనిది కాబట్టి, యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీతో సంబంధిత చెల్లింపులు వంటి బాధ్యతలను వేదాంత భరించాల్సి ఉంటుందని తెలిపింది.

గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

Business News వెబ్‌సైట్ అయిన ది ఎకనామిక్ టైమ్స్ తెలుగులో Share Market, స్టాక్ మార్కెట్‌కి సంబంధించిన లేటెస్ట్, బ్రేకింగ్ న్యూస్ చదవండి.
భరత్ కలకొండ గురించి
భరత్ కలకొండ Digital Content Producer
భరత్ కలకొండ ఎకనామిక్ టైమ్స్ తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్‌తో పాటు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓ, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన తాజా అప్డేట్లు, ప్రత్యేక కథనాలు అందిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తారు. ఆయనకు జర్నలిజంలో 7 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ఈటీవీ భారత్, సాక్షి వంటి ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు. భరత్ కలకొండ ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు. ఉత్తమ పనితీరుకు గానూ 2024లో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి మ్యాజికల్ మోటివేటర్ అవార్డును అందుకున్నారు.Read More