Veligonda Project : 30 ఏళ్ల కల సాకారం… నేడే వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్ - 1 ప్రారంభం, కరవు నేలకు కృష్ణమ్మ జలాలు!
Veligonda Project Phase 1 Opening : దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఇవాళ ప్రారంభిస్తారు. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేసింది.
మార్కాపురం జిల్లా ప్రజల దశాబ్దాల నాటి చిరకాల స్వప్నం నెరవేరే సుదినం రానే వచ్చింది. తీవ్ర కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత దాహార్తిని తీర్చేందుకు రూపుదిద్దుకున్న వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం(ఆగస్ట్ 31) అధికారికంగా ప్రారంభించనున్నారు. 'వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు' పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఈ చారిత్రక ఘట్టాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తోంది.
తీవ్ర వర్షాభావం, పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు, ఇంటింటినీ వేధిస్తున్న ఫ్లోరైడ్ రక్కసి, నీళ్లు లేక బీడువారిన వ్యవసాయ భూములు.. ఇవీ ఇన్నాళ్లూ మార్కాపురం, ప్రకాశం ప్రాంతాల ఘోష. వీటన్నింటికీ వెలిగొండ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం చూపనుంది. శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా కృష్ణా జలాలను తరలించి, నల్లమలసాగర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి ప్రధాన కాలువల ద్వారా తాగు, సాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసేలా ఈ భారీ ప్రాజెక్టును రూపకల్పన చేశారు.
ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 30 మండలాలకు చెందిన 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అలాగే ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలతో సహా దాదాపు 23 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు లభిస్తుంది.
తాజాగా ప్రారంభమవుతున్న తొలి దశ ద్వారా నల్లమలసాగర్‌కు 10.70 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేస్తారు. దీనివల్ల మొదటి విడతలోనే 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతాయి. నీటి లభ్యత పెరగడంతో పంటల సాగుపై రైతులకు ధైర్యం కలగడమే కాకుండా ఉద్యానవనం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల స్థానికంగానే ఉపాధి అవకాశాలు పెరిగి, పొట్టకూటి కోసం పక్క ప్రాంతాలకు వెళ్లే వలసలకు అడ్డుకట్ట పడుతుంది.
వెలిగొండ ప్రాజెక్టు ప్రయాణం సుదీర్ఘమైనది. 1996 మార్చి 5న నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, అదే చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రాజెక్టు తొలి దశను స్వయంగా ప్రారంభించి నీటిని విడుదల చేస్తుండటం విశేషం.
టన్నెళ్ల నిర్మాణం, ఫీడర్ కాలువలు, భూసేకరణ వంటి ఎన్నో సాంకేతిక, ఆర్థిక అడ్డంకులను అధిగమిస్తూ ఈ పనులు పూర్తయ్యాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత వెలిగొండకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పనులను పరుగులు తీగించింది.
కేవలం 48 రోజుల వ్యవధిలోనే నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం జమ చేసింది. గెజిట్‌లో పేర్లు లేని వారి కోసం మరొక రూ.169 కోట్లు, 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి నిర్వాసితులను ఆదుకుంది.
ఇవాళ ఉదయం 10.35 గంటలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, వెలిగొండ ఫేజ్-1 పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రాజెక్టు గేట్లను ఎత్తి కృష్ణా జలాలను విడుదల చేస్తారు.
E-Paper

